4, జులై 2008, శుక్రవారం

లంఖణం ( ఉపవాసం) ని కనిపెట్టింది ఎవరు.... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు..,.,

దాహం వేస్తే నీరు త్రాగాలని మనకు తెలుస్తున్నది. శరీరానికి నీరు కావలసి వచ్చినప్పుడు అది అడుగుతోంది. మనము త్రాగుతున్నాము. ఈ విషయంలో అన్ని జంతువులు ఇలానే ప్రవర్తిస్తాయి. దాహానికి నీరు త్రాగాలనే విషయం తెలియడానికి ఇంకొకరు మనకి చెప్పనవసరం లేదు. మనం ఇంకొకరిని అడగవలసిన పని లేదు. దాని కొరకు చదువుకోవలసిన పని లేదు. వైద్యుల సలహా అక్కర్లేదు. ఆకలి వేస్తే శరీరం నాకు ఆహారము కావాలని మనల్ని అడుగుతుంది. అప్పుడు మనం తింటే దాని అవసరం తీరి ఊరుకుంటుంది. ఆకలి వేస్తే ప్రతి జంతువు శరీరానికి ఆహారాన్ని అందించాలని తెలుసుకుని అందిస్తున్నాయి. అలాగే శరీరము అలసిపోతే, నాకు అలసటగా ఉందని తెలియ చేస్తుంది. అప్పుడు మనం విశ్రాంతి తీసుకుని దానికి సహకరిస్తున్నాము. జంతువులన్నీ అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలని తెలుసుకుని అలానే తీసుకుంటున్నాయి. ఈ విషయంలో కూడా వాటికీ ఎవరూ బోధించవలసిన పనిలేదు. పైన చెప్పిన మూడు విషయాలలో జంతువులు, మనము కూడా ఒకే విధముగా ప్రవర్తిస్తున్నాము. ఏ శరీరమైనా ఈ ధర్మాలు ఒక్కటేనని మనకు తెలుస్తున్నది. ఇప్పుడు నాలుగో విషయం ఆలోచిద్దాము. శరీరానికేప్పుడైనా బాగోకపోయినా, ఆకలి లేకపోయినా, పొట్ట మందంగా ఉన్నా, జ్వరంలా వచ్చినా అప్పుడు శరీరం, నాకు బాగోలేదు, ఈ రోజుకి నీవు కాస్త తినడం మాని, తిరగకుండా పడుకుంటే బాగుంటుందని కోరుకుంటుంది. అప్పుడు మనకు వెంటనే శరీరం చెప్పినట్లు విందామనిపిస్తుంది. మనకు బుడ్డి, జ్ఞానమున్నది కదా! కాసేపటికి వేరే విధముగా ఆలోచనలు మారతాయి. అప్పుడు మనం ఏమి చేస్తాము. మన అమ్మకో, నాన్నకో లేదా ఇంట్లో పెద్దవారికో మన పరిస్థితి చెప్పుకుంటాము. ఇప్పటికే భోజనం లేటు అయ్యింది, తినకపోతే నీరసం వస్తుంది, ఈ పూటకు తిను, సాయం కాలం డాక్టరు దగ్గరకు పోదాములే అని సలహా ఇస్తారు. వండింది వేస్తూ అవుతుంది అనో, తినక పోతే నీరసం వస్తుందనో, ప్రక్కవారు తినమన్నారనో మనకు ఇష్టం లేకపోయినా తింటాము. మనం ఇక్కడ శరీరం కోరినట్లుగా కాక దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి చివరకు డాక్టరు దగ్గరకు పోయి శరీరాన్ని అప్పగిస్తాము. ఈ విషయంలో 84 లక్షల జీవరాసులు ఏమి చేస్తాయో చూద్దాము.

***

శరీరం నాకు బాగోలేదు, నీవు తినవద్దు, తిరగ వద్దు అని కోరింది కాబట్టి వెంటనే ఆ క్షణం నుండీ తినడాన్ని పూర్తిగా ఆపేస్తాయితినవలసిన పనిలేకపోతే ఇంకా తిరగవలసిన పని వాటికేముంటుంది. కాబట్టి విశ్రాంతి కూడా శరీరం కోరినట్లు ఇచ్చి హాయిగా పడుకుంటాయి. తిండి మనడం, విశ్రాన్తినివ్వడం అనే రెండు పనులు చెయ్యడానికి వల్ల అమ్మ, నాన్నలనో, ప్రక్కనుండే స్నీహితులతోనో ముచ్చటించవలసిన పనిలేదు. ఇక్కడ ఇవి శరీర ధర్మాన్ని గౌరవించి వట్టిగా పాడుకుంటాయి. "ధర్మో రక్షతి రక్షితః" అన్నట్లు ఆ ధర్మమే వాటిని కాపాడుచున్నది. ఇలా శరీరం వద్దన్నానని రోజుల పాటు విశ్రాంతి నిచ్చి, మరలా నాకు ఆహరం కావాలని శరీరం కోరినప్పుడు తినడం ప్రారంభిస్తాయి. ఇలా శరీరం వద్దన్నప్పుడు ఆహారాన్ని తినడం మాని, విశ్రాంతి నివ్వడం అనేదాన్ని ఆనాటి నుండీ ఈనాటి వరకూ ఆచరించి చూపుతూ వాటి ఆరోగ్యాన్ని అవే కాపాడు కుంటున్నాయి. ఈ ధర్మాన్ని అవి వాటి పిల్లలకు, మనుమలకు అలా బోధించవలసిన పని లేకుండా, తరతరాలుగా ప్రతి జీవికి పుట్టుకతో ఈ జ్ఞానం తెలుస్తూనే ఉంటున్నది. ఈ జ్ఞానం జంతువుల వలె మనిషికి కూడా అనాదిగా వస్తూ ఉన్నది. మనిషి కూడా నియమం తప్పకుండా ఈ శరీర ధర్మాన్ని గౌరవించడం జరిగిందీ. పేరు పెట్టడం వరకే మనిషి హస్తం తప్ప లంఖణం ని మనిషి కనిపెట్టలేదు. మనిషి పుట్టక ముందే లంఖణం పుట్టింది. అది ఈ భూమి పై జీవులు శరీరాన్ని ధరించినప్పటి నుండీ ఉన్నా ధర్మం. దాహానికి నీరు, ఆకలికి ఆహరం, అలసటకు విశ్రాంతి ఎలాంటి ధర్మాలో రోగానికి లంఖణం ఉండడం అలాంటి ధర్మమే. ఈ లంఖణం అనేది ఒక మతానికి గాని, ఒక కులానికి గానీ, ఒక దేశానికి గానీ, ఒక జాతికి గానీ, ఒక ప్రకృతి వైద్యానికే గానీ సంబంధించినది కాదు. శరీరమున్న ప్రతి జీవికి సంబంధించిన విషయం. ఇదేదీ మూదాచారమూ కాదు. చదువుకొని, వైద్య శాస్త్రం తెలియని మన పెద్దలు కనిపెట్టింది కాదు. అది శరీరానికి పుట్టుకతో వచ్చే సహజ ధర్మమూ. ఇన్ని కూతల రకాల శరీర నిర్మాణ సారధి ఎవరో, ఆయన ఈ శరీరాలకు ఆరోగ్య నిమిత్తం ఇచ్చిన వరం. దానిని జంతువుల వలె మనిషి కూడా గౌరవిస్తే ఆరోగ్యం వరం. లేదా రోగాల పరం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి