1, మే 2010, శనివారం

భక్త యోగి - కర్మ యోగి

బాటసారులు దాహం తీర్చుకోవటానికి ఎవరో మహానుభావులు ఊరికి దగ్గరగా ఒక చెరువు తవ్వించారు.  దాని గట్టునే పెద్ద రావి చెట్టు ఉంది.  అలసి పోయిన బాటసారులు ఆ చెరువులో నీరు తాగి చెట్టు దగ్గర బండ మీద కాసేపు విశ్రమించి వెళ్ళేవారు.  ఆ అరుగు మీద ఒక గ్రామస్థుడు కూర్చుని ఉన్నాడు.  ఎందుకోగానీ మొహం బాగా విసుగ్గా పెట్టుకుని, తనలో తనే ఏదో గొణుక్కుంటూ ఉన్నాడు.   ఆ మార్గంలో వెళ్తున్న ఒకాయన ఏవో పదాలు పాడుకుంటూ ఏక తారా మీటుతూ అటువైపు వచ్చాడు.  ఆయనకు అక్కడ కాసేపు విస్రమించాలని అనిపించింది.  అక్కడే కూర్చుని ద్యానం చేసుకుంటున్నాడు.  ఇంతలో గ్రామంలోనుంచి కొందరు ఆకతాయి పిల్లలు గోల గోలగా అరుస్తూ వచ్చారు.  ఒక తేలుకు దారం కట్టి గిరగిరా తిప్పుతూ ఆనందిస్తున్నారు.  కాసేపటికి వాళ్ళకు దాని మీద ఆసక్తి తగ్గింది.  దాన్ని చెరువులోకి విసిరేసి, ఎవరి దారిన వారు ఇళ్ళకు వెళ్లి పోయారు. 

***
ఇదంతా గమనిస్తున్న ఆ భక్తుడు ఒక ఆకును తీసుకుని, చెరువు గట్టు దగ్గరికెళ్ళి  దాన్ని తేలు దగ్గరగా పెట్టాడు.  అది నెమ్మదిగా ఆకు మీదకు ఎక్కింది.  దాన్ని జాగ్రత్తగా తీసుకువచ్చి రక్షిత ప్రాంతంలో వదలాలి అనేది ఆయన సంకల్పం.  కాని, అది ఆయనను కుట్టింది.  ఆ కదలిక వాళ్ళ మళ్ళీ చెరువులో పడింది.  ఆయన మళ్ళీ దాన్ని ఆకు మీదకు రానిచ్చి రెండు అడుగులు వేసాడు.   అది మళ్ళీ ఆయనను కొండితో కుట్టి కదలికకు చెరువులో పడి పోయింది.  ఇట్లా ఆయన దాన్ని ఆకు మీదకు ఎక్కించి రక్షించటం, అది ఆయనను కుట్టి చెరువులో పడటం ఐదుసార్లు జరిగింది.  చెట్టు కింద కూర్చున్న ఆసామికి ఆయన మీద కోపం వచ్చింది.  'ఏమిటి స్వామీ, అది విష కీటకం.  తేలుకు కొండిలో విషం ఉంటుందంటారు.  మీరేమో దాన్ని రక్షిస్తున్నారు.  అదేమో మిమ్మల్ని కుడుతూనే ఉంది.  మీ ప్రవర్తన నాకేం అర్ధం కావటం లేదు... చూడటానికి మీరు జ్ఞానుల్లా ఉన్నారు.  ఇదేమి పని?  అని ఆయన్ని మందలిస్తున్నట్లు విసుగ్గా, కోపంగా, కటువుగా కసురుకున్నాడు.  దానికి ఆ భక్తుడు 'నాయనా ! నా విధి నేను నిర్వర్తిస్తున్నాను.  ఆపదలో ఉన్న జీవిని రక్షించడం మనిషి కనీస ధర్మం.  దాని విధి అది నిర్వర్తిస్తుంది.  కొండితో కుట్టడం దాని లక్షణం.  పైగా నేను రక్షిస్తున్నట్లు దానికి తెలీదు.  అది ఆకు మీద స్థిరంగా ఉన్నప్పుడు... దాన్ని ఆ రాతిగుట్ట దగ్గర పెట్టి, నా దారిన నేను పోతాను' అని నిదానంగా చెప్పాడు.  మరి అది ప్రతిసారీ మీ చేతిని కుడుతోంది కదా.  మీకు కష్టంగా లేదా?  పైగా అన్నిసార్లు దాని కోసం ప్రయాసపడటం, మీకు విసుగానిపించడం లేదా?  అని అడిగాడు ఆ గ్రామస్థుడు.  అతనడిగిన ప్రశ్నకీ, అతని అమాయకత్వానికీ ఆ భక్తుడికి నవ్వొచింది.
***
'నాయనా, నీవెవరో నాకు తెలుయదు.  రూపాన్ని బట్టి రైతులా వున్నావు.  విధి నిర్వహణలో కష్టం, విసుగు అనే మాటలకు తావుండదు.  ఆ రెండూ నీ లక్ష్యానికి అడ్డు వస్తాయి.  ఎంత కష్టమైనా మన పని మనం చెయ్యాలి.  చేసే పని మీద మనకెప్పుడూ విసుగు రాకూడదు.  అది ధర్మ సూక్షం.  అర్ధం చేసుకుంటే నీకే బోధపడుతుంది' అన్నాడాయన.
***
ఈలోగా ఆ తేలు ఆకు మీదనుంచి కిందపడి గబా గబా ఎటో వెళ్ళిపోయింది.  ఆయన సంతోషించాడు.
***
ఆ రైతు ఆ భక్తుడిని గౌరవ భావంతో చూస్తూ నమస్కరించాడు.  ఆయన ఎకతారా తీసుకుని బయలుదేరబోతున్నాడు.  తన సమస్యకు పరిష్కారం ఆయన చెప్పగలడని నమ్మకం  కలిగింది.
***
'స్వామీ! నా పేరు భూపతి.  నేనొక రైతుని.  వర్షాలు లేక, చీడల పీడల వల్ల పంటలు  పండటం లేదు.  పడ్డ శ్రమంతా వృధా అవుతోంది.  కష్టపడి సంపాదించినన్నాళ్ళు ఎంతో గౌరవంగా చూసే భార్యా పిల్లలు- నన్ను చులకనగా చూస్తూ విసుక్కుంటున్నారు.  అందుకని ఇంటి మీద అలిగి, ఈ బొద్దు రాయి దగ్గరికి వచ్చి కూర్చున్నాను.. మీరు జ్ఞానులు... మీ మాటలు ఎంతో  ధైర్యాన్నిచ్చాయి.  నాకు ధర్మం తెలిసింది...' అన్నాడు.
***
'నాయనా కాలం ఎప్పుడూ ఒక రకంగానే వుండదు.  ఒక్క ఏడాది పంటలు పండకపోతేనే నిరుత్సాహపడి కోపం తెచ్చుకోకూడదు.  వ్యవసాయం నీ ధర్మం.  ఈ సంవత్సరం వర్షాలు సంవృద్దిగా కురుస్తాయి.  పంటలు పుష్కలంగా పండుతాయి.  మీ గాదెలు నిండుతాయి.  నీ పనిని విసుగు లేకుండా చేయి.  ఫలితం బాగుంటుంది.  సమర్దుడివి అని నిరూపించుకో.  ధన హీనుడిని ఎవ్వరూ గౌరవించారు.  అది లోక ధర్మం.  నిన్ను నిరసించిన వారే మళ్ళీ నిన్ను గౌరవిస్తారు` అని బోధించి బయలు దేరారు ఆయన.  'స్వామీ... మీ పేరు?' " నాకంటూ పేరు లేదు. అందరూ నన్ను కబీరు అంటారు...' అని ఎకతారా మీటుకుంటూ ఆయన నిష్క్రమించారు....  రాదా మనోహర్...